అర్జున్ - Day 1

అర్జున్

ఆంధ్రా - ఒడిస్సా తీర ప్రాంతం, మాణిక్యపురానికి 100 కిలోమీటర్ల దూరంలో ఓ అడవి ప్రాంతం. ఆకాశం నుండి చూస్తే పచ్చటి తివాచీ పరిచనట్లుంది . సహజసిద్ధమైన ఆ ప్రకృతి సోయగాలకి పిల్ల గాలి తోడయింది. దట్టమైన అడవి ప్రాంతం కావడంతో అక్కడే ఉండే తండా వాసుల అడుగులే రహదారి. తూర్పున బంగాళాఖాతం, మిగతా మూడు వైపులా దట్టమైన అడవి ప్రాంతం. జన సంచారం లేని ప్రదేశం కావడంతో చాలా ప్రశాంతంగా ఉంది. ప్రశాంతంగా ఉండే అడవిలో వేట సహజం అన్నట్లు దూరము నుంచి గుఱ్ఱపుడెక్కల చప్పుడు వినపడుతోంది. అవి యుద్ధరంగంలోకి శబ్ధ వేగంతో దూసుకు వస్తున్నట్లున్నాయి. అడవి ప్రశాంతంగా ఉన్నా లేడి మనసులో ఎప్పుడూ ఒక భయం, ఏ పొద చాటున పులి ఉంటుందో అని. అలాంటి అడవిలో లయ భద్దమైనటువంటి ఆ చప్పుడి మధ్యలో ప్రాణాలు అరచేతితో పట్టుకుని పరుగు తీస్తున్నాడు ఓ నిర్భాగ్యుడు. గుండె వేగం పెరుగుతోంది. అలాగే పరిగెడుతుంటే గుండె ఆగుతుందన్న ఆలోచన కూడా లేకుండా పరుగు తీస్తున్నాడు. అతని కాళ్ళకు రక్తమే కవచమై మెత్తని ప్రకృతి స్పర్శ కూడా తెలియకుండా చేస్తోంది. శరీరంలోని శక్తిని ఆ కవచమే హరిస్తోన్నట్లుంది. అయినా ఎక్కడో ఒక చిన్న ఆశ, ఆగకుండా పరిగెడితే చివరి క్షణంలోనైనా బయటపడవచ్చని. పులి పంజా విసురుకి జింక కూలబడినట్లు అరవీర భయంకరమైన ఓ మారణాయుధం వెన్ను మీద పడడంతో మోకాళ్ళు నేలను తాకాయి. అతని నిస్సహాయత, పోరాడే శక్తి లేని బలహీనత విధికి దాసోహం తెలుపుతూ మృత్యు దేవతకు ఆహ్వాణం పలుకుతున్నట్లు కంటి నుండి మొదటి నీటి బొట్టు నేలకు జారింది. బాహ్య ప్రపంచానికి తెలియని ఒక నిజాన్ని తనతోపాటు మూగబోకుండా పంచ బూతాలను శరణు వేడుతున్నట్లు అతని కళ్ళు చూస్తున్నాయి.
 

Comments

  1. good start ra Balu..small calrification in 8th line..though sabdha vegam sounds logical..general ga manam vaayu vegam or mano vegam aney vintoo untaam kadaa..sabdha vegam ok na?

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

కలలో కోలా

అర్జున్ - Day 4